Wednesday 19 June 2013

శ్లోకం 17







ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|
అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||


శ్లోకం 17

---------------------------------------------------------------------------------------------------------------

  1. ఉపేంద్రః --- ఇంద్రునిపై ఇంద్రుడు (ఇంద్రునకు అధిపతి); ఇంద్రునకు తమ్ముడై (వామనుడై) అవతరించినవాడు; ఇంద్రియములకు అగోచరుడు.
  2. వామనః --- పొట్టివానిగా అవతరించిన వాడు; చక్కనైన, కనులకింపైన, చూడ చిన్నదైన రూపము గలవాడు; ఇంద్ర రక్షణకు వామనావతారము దాల్చినవాడు.
  3. ప్రాంశుః --- ఎంతో ఎత్తైన, ఉన్నతమైన, విస్తారమైన దేహముగలవాడు; త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు.
  4. అమోఘః --- మహదాశయముతో విశేష పరిణామములు గల పనులు చేసెడివాడు; శ్రీహరి ప్రతి కార్యము విశేషించి కారణ యుక్తము, ఏదియును వ్యర్ధము కాదు, ప్రతి పనికిని పరమార్ధము కలదు.
  5. శుచిః --- పరమ పావన మూర్తి, ఏ విధమైన దోష మాలిన్యములు అంటనివాడు; ప్రత్యుపకారమేమియును కోరని పరిశుద్ధుడు; భక్తులను పవిత్రులుగా చేయువాడు.
  6. ఊర్జితః --- అనంత శక్తి సామర్ధ్య సంపన్నుడు; బలి చక్రవర్తిని పాతాళమునకు త్రొక్కిన మహాబలవంతుడు; ఐశ్వర్యము, శక్తి సంపన్నత, నిర్మలత్వము గలవన్నియును భగవద్విభూతులు (తేజోంశ సంభూతములు).
  7. అతీంద్రః --- ఇంద్రునికంటె అధిపుడు; మనసు కంటె శ్రేష్ఠుడు.
  8. సంగ్రహః --- ప్రళయ కాలమున సమస్తమును తనయందు చేర్చుకొనువాడు; సమస్తమును కలిపి తన అధీనములో నుంచుకొన్నవాడు; సులభముగా, కేవలము భక్తి వల్లనే పొందనగువాడు (అందుబాటులో ఉండేవాడు)
  9. సర్గః --- తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృజించినవాడు; భక్తులననుగ్రహీంచుటకు తనను తానే సృష్టించుకొనువాడు (అవతరించువాడు).
  10. ధృతాత్మా --- సకల జీవాత్మలకును ఆధారమైనవాడు (అన్ని ఆత్మలను ధరించువాడు); షడ్భావ వికారములు లేనివాడు.
  11. నియమః --- శాసన కర్త; నియమములనేర్పఱచి, నియంత్రించి, నడపువాడు; భక్తుల శత్రువులను నిగ్రహించువాడు.
  12. యమః --- పరిపాలించువాడు. సమస్తమును (ప్రకృతి శక్తులను) వశము చేసుకొన్నవాడు; జీవుల హృదయములందు అంతర్యామియై నడిపించువాడు.

మూలం: http://te.wikipedia.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము
http://te.wikisource.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము

Wednesday 12 June 2013

శ్లోకం 16




భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|

అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||

  1. శ్లోకం 16

    1. భ్రాజిష్ణుః --- స్వయంప్రకాశ స్వరూపుడు; తేజోమయుడు; (సాధన చేయు, శరణాగతులైన) భక్తులకు కనిపించువాడు.
    2. భోజనం --- నోటితో గాని, జ్ఞానేంద్రియములతోగాని స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, గంధము వంటివి) అన్నియును భగవత్స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను, ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫల రూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు; సచ్చిదానంద స్వరూపుడు.
    3. భోక్తా --- భుజించువాడు; భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు; భక్తితో నొసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు; యజ్ఞములో అర్పించినదానిని గ్రహించువాడు.
    4. సహిష్ణుః --- సహించి, క్షమించి, అనుగ్రహించు కరుణామయుడు; ఓర్పు కలిగి భరించు సర్వ సాక్షి, సహన మూర్తి; దుష్టులను సంహరించువాడు.
    5. జగదాదిజః --- జగములన్నింటికంటే ముందుగా నున్నవాడు.
    6. అనఘః --- పాపరహితుడు; కల్మషము లేనివాడు.
    7. విజయః --- జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడ కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు.
    8. జేతా --- జయించువాడు; అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును.
    9. విశ్వయోనిః --- విశ్వమునకు జన్మ స్థానము, కారణము; విశ్వమే కారణముగా గలవాడు.
    10. పునర్వసుః --- తన సృష్టి యందంతట సకల దైవములందును అంతరాత్మయై మరల మరల విలసిల్లువాడు; ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.


మూలం: http://te.wikipedia.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము
http://te.wikisource.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము


Wednesday 5 June 2013

శ్లోకం 15



లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||




  1. శ్లోకం 15 

  2. లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి.
  3. సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు.
  4. ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు.
  5. కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు.
  6. చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు); నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు.
  7. చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము); ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు.
  8. చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము).
  9. చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి.

మూలం: http://te.wikipedia.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము
http://te.wikisource.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము

Wednesday 29 May 2013

శ్లోకం 14



సర్వగ స్సర్వవిద్భానుః విష్యక్సేనో జనార్దనః|
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||

  1. శ్లోకం 14

  2. సర్వగః --- అంతటను గమనము గలవాడు; ఎక్కడైనా చేయూతనిచ్చువాడు.
  3. సర్వవిత్ --- సమస్తము తెలిసినవాడు; సమస్తమునకు పునరుజ్జీవనము ప్రసాదించువాడు (వెలుపలికి తీయువాడు)
    సర్వవిద్భానుః ---(శంకరాచార్యులు ఒకేనామముగా పరిగణించిరి) సర్వము తెలిసి, అవిరామముగ, అవికారముగ ప్రకాశించేవాడు.
  4. భానుః --- ప్రకాశించువాడు.
  5. విష్వక్సేనః --- లోక రక్షణార్ధము అన్ని దిక్కులందు సైన్యము గలవాడు; తన తలంపు మాత్రమున సర్వదానవ సైన్యమును నాశనము చేయువాడు.
  6. జనార్దనః --- దుష్టులను శిక్షించువాడు; దుష్టుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించువారిని పరిమార్చువాడు; కామితార్ధములకై భక్తులు ఎవరిని ఆశ్రయింతురో ఆ దేవుడు.
  7. వేదః --- సమస్త జ్ఞానము మూర్తీభవించినవాడు; వేదమూర్తి.
  8. వేదవిత్ --- వేదములను, వాని సారము (అర్థమును) సంపూర్ణముగా నెరిగినవాడు; వేదజ్ఞానము బోధీంచువాడు.
  9. అవ్యఞ్గః --- ఏ విధమైన లోపములు లేనివాడు (వేద జ్ఞానమందు, గుణ వైభవమునందు). వేదాంగములు తానే అయినవాడు.
  10. వేదాఞ్గః --- వేదములే శరీరముగా (అంగములుగా) గలవాడు; వేదమూర్తి.
  11. వేదవిత్ --- వేదములనెఱుగుటయే గాక, వేదసారమైన ధర్మమునెరిగినవాడు.
  12. కవిః --- సామాన్య దృష్టినధిగమించి, సునిశిత దర్శనము (సూక్ష్మ దృష్టి) కలిగిన వాడు; సకలమును దర్శించువాడు; రమ్యముగా కనుపించువాడు.


మూలం: http://te.wikipedia.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము
http://te.wikisource.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము


Wednesday 22 May 2013

శ్లోకం 13




రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|
అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||


  1. శ్లోకం 13 [మార్చు]

  2. రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు (1. ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు 2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు); భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.
  3. బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.
  4. బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)
  5. విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.
  6. శుచిశ్రవాః --- శుభప్రదమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.
  7. అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.
  8. శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైనవాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.
  9. వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు.
  10. మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు)గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.

మూలం: http://te.wikipedia.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము
http://te.wikisource.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము

Wednesday 15 May 2013

శ్లోకం 12




వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః|
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||


  1. శ్లోకం 12 

  2. వసుః --- సమస్త భూతములు తనయందు గలవాడు; తన భక్తుల హృదయములందు వసించువాడు; క్షీరసాగరమున వసించువాడు; భక్తులు కోరుకొను పరమార్ధము; అష్ట వసువులలో శ్రేష్టుడైన పావకుడు; అంతరిక్షమున వసించువాడు.
  3. వసుమనాః --- శ్రేష్ఠమయిన, సకలైశ్వర్యవంతమయిన మనసు గలవాడు; ఏ విధమైన వికారములకును లోనుగాని పరమ శాంతిచిత్తుడు; తన భక్తులను గొప్ప నిధులుగా భావించువాడు.
  4. సత్యః --- నిజమైనది, మూడు కాలములలోనుండునది, నాశనము లేనిది; ప్రాణము, పదార్ధము (అన్నము), సూర్యుడు అనే మూడింటిచే కూడిన రూపము గలవాడు; సత్ప్రవర్తనయందు ప్రీతిగలవాడు,
  5. సమాత్మా --- సమమైన, భేదభావములేని, రాగద్వేష రహితమగు ఆత్మ;
  6. సమ్మితః --- తన భక్తులచే ఇచ్ఛానుసారముగా నియంత్రింపబడువాడు (వారి అనుభవములకు గోచరించువాడు); ఋషులచే అంగీకరింపబడి, ఉపనిషత్తుల ద్వారా తెలుపబడినవాడు;
    అసమ్మితః --- పరిచ్చేదింపబడజాలనివాడు; అంత్యము, హద్దు లేనివాడు
  7. సమః --- అన్నింటియందును సమభావముగలవాడు; మార్పులేకుండ ఎల్లప్పుడు సమముగా (ఒకే తీరున) ఉండువాడు; (స మయా-)శ్రీలక్ష్మీ సమేతుడు.
  8. అమోఘః --- తనను పూజించువారికి నిశ్చయముగ సత్ఫలితములనిచ్చువాడు (భగవంతుని ఆరాధన వ్యర్ధము కాదు).
  9. పుణ్డరీకాక్షః --- తామరపూవు వంటి కన్నులు గలవాడు; అందరి హృదయ కమలమున వసించి సమస్తమును చూచువాడు; వైకుంఠవాసులకు కనుచూపువంటివాడు.
  10. వృషకర్మా --- ధర్మమే తన నిజకర్మగా గలిగినవాడు.
  11. వృషాకృతిః --- మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు.






మూలం: http://te.wikipedia.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము
http://te.wikisource.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము


Wednesday 8 May 2013

శ్లోకం 11




అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః|
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః||


శ్లోకం 11

  1. అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
  2. సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
  3. సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
  4. సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
  5. సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.
  6. అచ్యుతః --- తన దివ్య తేజో విభూతి శక్తి సంపన్నత్వములనుండి యెన్నడును జారని (తరగని)వాడు; తన భక్తులెన్నడును పతనము చెందకుండ గాచువాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.
  7. వృషాకపిః --- జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; ధర్మ పరిరక్షకుడు.
  8. అమేయాత్మా --- ఆ పరమాత్ముని స్వరూపము కొలుచుటకు (తెలిసికొనుటకు) సాధ్యము కాదు; ఆశ్రితులను అనుగ్రహీంచుటలో పరిమితి లేనివాడు. ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు - భగవంతుడు. అందరి ఊహలకు తాను కారణమై యుండగా తన ఊహలను ఊహించు సామర్ధ్యమెవరికున్నది.
  9. సర్వ యోగ వినిసృతః --- అన్ని సంగములకు, బంధములకు, విషయ వాసనలకు అతీతుడు; ఎన్నో విధములైన (జ్ఞాన, కర్మ, భక్తి వంటి) యోగములద్వారా సులభముగా పొందనగువాడు.

మూలం: http://te.wikipedia.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము
http://te.wikisource.org/wiki/విష్ణు_సహస్రనామ_స్తోత్రము